రెండేళ్ల కాలంలో 1117 కుక్కకాటు బాధితులు…

రెండేళ్ల కాలంలో 1117 కుక్కకాటు బాధితులు…
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం పిహెచ్ సి పరిధిలో అధికం.,.
అందిన కాడికి పట్టి పీకేస్తున్న వైనం….
దుమ్ముగూడెం: (ఆంధ్రప్రభ): ఇటీవల కాలంగా గ్రామ సింహాల గర్జనలు అధికమయ్యాయి. లెక్కకు మించి శునకాలు గుంపులు గుంపులుగా ప్రధాన కూడళ్లలో చేరి హల్ చల్ చేస్తూ పెద్దలు, చిన్న పిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా ఎగబడి దాడి చేస్తున్నాయి. ఈ గ్రామ సింహాల దాడిలో మేకలు, గొర్రెలు కూడా తీవ్రంగా గాయపడి మృత్యువాత పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. దుమ్ముగూడెం అతిపెద్ద మండలం కావడంతో రోజు ఎక్కడో ఒక దగ్గర కుక్క కాటుకు గురై ఆసుపత్రి పాలైన వారు ప్రతిరోజు కనబడుతున్నారు. మండలంలో ఉన్న మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 24 గంటల పి హెచ్ సి గా ఉన్న దుమ్ముగూడెంలో గత రెండేళ్ల కాలంగా అధికంగా కుక్క కాటు కేసులు నమోదు కాగా, ఈ రెండేళ్ల కాలంలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొత్తం 1117 మంది బాధితులు కుక్కకాటుతో ఆసుపత్రి పాలయ్యారు.
గత ఏడాది బాధితులను పరిశీలిస్తే…..
ప్రతి ఏడాది నుంచి మరో ఏడాది గడిచిపోతున్న కొద్ది ఈ కుక్క కాటు బాధితులు అధికమవుతున్నారు. 2024 లో దుమ్ముగూడెం పిహెచ్సి పరిధిలో కుక్కకాటు కారణంగా 335 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందగా, పర్ణశాల పిహెచ్సి పరిధిలో 117 మంది, నరసాపురం పిహెచ్సి పరిధిలో 156 మంది బాధితులు చికిత్స పొందారు. ఈ మొత్తం 12 నెలలకు గాను 608 మంది బాధితులు ఆ ఏడాది కుక్క కాటు కారణంగా ఆసుపత్రి పాలవలసిన పరిస్థితి నెలకొంది. అదే ఏడాది దుమ్ముగూడెం పిహెచ్సి పరిధిలో ఫిబ్రవరి మాసంలో 45 మంది, పర్ణశాల పిహెచ్సి పరిధిలో జనవరిలో 16 మంది, నరసాపురం పిహెచ్సి పరిధిలో ఏప్రిల్ మాసంలో 19 మంది అత్యధికంగా కుక్క కాటు బాధితులుగా మారారు.
ఈ ఏడాది మరింత పెరగనున్న బాధితులు…
గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా కుక్కకాటు బాధితులు మరింత పెరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఏడాది దుమ్ముగూడెం పిహెచ్సి పరిధిలో జనవరి నుంచి అక్టోబర్ మాసం వరకు 250 మంది బాధితులు కుక్క కాటుకు గురవగా, పర్ణశాల పిహెచ్సి పరిధిలో 106 మంది, నరసాపురం పిహెచ్సి పరిధిలో 153 మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అక్టోబర్ మాసం చివరి వరకు ఈ మూడు పీహెచ్సీల పరిధిలో మొత్తం 509 మంది బాధితులు చికిత్స పొందగా, దుమ్ముగూడెం పిహెచ్సి పరిధిలో ఈ ఏడాది జనవరిలో 43 మంది, పర్ణశాల పిహెచ్సి పరిధిలో జనవరిలోనే 17 మంది, నరసాపురం పిహెచ్సి పరిధిలో ఫిబ్రవరి మాసంలో 25 మంది అత్యధికంగా కుక్క కాటుకు గురయ్యారు. ఇలా పరిశీలిస్తే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగే పరిస్థితులు కనబడుతున్నాయి.
మర్కటాల దాడులు అక్కడ ఎక్కువే..
ఓ వైపు కుక్క కాటు కారణంగా చికిత్స పొందేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దుమ్ముగూడెం, నరసాపురం ప్రాంతాలలో కోతుల తీవ్రత అధికంగా ఉంది. ఈ కారణంగా కోతుల దాడితో చికిత్సలు పొందుతున్న వారు కూడా అధికంగానే ఉన్నారు. పెద్ద దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రదేశాలలో ఈ మర్కటాలు చేస్తున్న హడావుడి అంతా కాదు. పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో ఈ మర్కటాల కారణంగా ఎందరో భక్తులు గాయాల పాలైన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గ్రామాలలో కుక్కకాట్లు అధికమవుతుండడం గ్రామాలలో ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాజాగా మండలంలోని కోయ నరసాపురం గ్రామంలో వీధి కుక్కలు గొర్రెల పై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ వీధి కుక్కలను అదుపు చేసేందుకు సరైన మార్గం లేక, ఉన్నతాధికారుల ఆదేశాల కోసం గ్రామ పంచాయతీ స్థాయి అధికారులు వేచిచూస్తున్నారు.
