10000-troops-us-third-aircraft-carrierవార్ సైరన్…! Andhra Prabha Top Story
10000-troops-us-third-aircraft-carrierవార్ సైరన్…! Andhra Prabha Top Story
- దౌత్యానికి బ్రేక్
- బలగాల తరలింపులో అమెరికా బిజీబిజీ
- ఇప్పటికే 50 వేల మంది మొహరింపు
- మరో 10 వేల మంది ఆన్ వే
- యుద్ధ విమానాలు రెడీ
- ఇకె దాడే జాప్యం
- అమరికా ఎన్నికలే ముహూర్తం
( వాషింగ్టన్, ఆంధ్రప్రభ)
ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక అడుగు వేసింది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే భారీగా మోహరించిన తన బలగాలకు మరింత బలాన్ని చేకూర్చేలా మూడో విమాన వాహక నౌకా దళాన్ని ఇరాన్‌కు సమీప జలాల్లోకి పంపుతోంది. అమెరికా సైనిక బలగాల ఈ తాజా కదలికతో ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలపై చర్చ మొదలైంది. అదే సమయంలో దౌత్య మార్గాల్లోనూ చర్చలు కొనసాగుతుండటం ఆసక్తికరంగా మారింది.
అమెరికా అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూఎస్‌ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ విమాన వాహక నౌకా దళం ఆదివారం శాన్ డియాగో స్థావరం నుంచి మధ్యప్రాచ్యం వైపు బయలుదేరింది. మరుసటి రోజే మాకిన్ ఐలాండ్ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ కూడా ఆ ప్రాంతానికి కదిలింది. ఇందులో 2,000 మందికి పైగా మెరైన్లు ఉన్నారు.
ఈ తాజా మోహరింపుతో నావికాదళ సిబ్బంది, మెరైన్లు కలిపి మరో 9 వేల నుంచి 10 వేల మంది వరకు అమెరికా సైనికులు మధ్యప్రాచ్యానికి చేరే అవకాశం ఉందని సమాచారం. నవంబర్ చివరి నాటికి ఇరాన్ సమీపంలో మూడు విమాన వాహక నౌకా దళాలు, రెండు ఉభయచర దాడి బృందాలు అందుబాటులో ఉండేలా అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సైనిక ఆప్షన్లు
ఈ భారీ సైనిక సమీకరణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్‌పై తదుపరి చర్యల విషయంలో మరిన్ని అవకాశాలను అందించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా చేరనున్న బలగాల్లో ఎఫ్-35 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే మధ్యప్రాచ్యంలో సుమారు 50 వేల మంది అమెరికా సైనికులు ఉన్నట్లు సమాచారం. కొత్త బలగాలు చేరితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. దౌత్య చర్చలు ఏ దిశలో సాగినా.. సైనిక ఎంపికలను సిద్ధంగా ఉంచాలన్నదే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ కూడా.. అధ్యక్షుడు ఆదేశిస్తే తమ బలగాలు కొత్త దాడులకు సిద్ధంగా ఉన్నాయని గతంలో స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా అమెరికా సైనిక ఉనికి
మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికి ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలోని పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు, తాత్కాలిక కేంద్రాలు కొనసాగుతున్నాయి. బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో అమెరికాకు శాశ్వత స్థావరాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ప్రాంతంలో కనీసం 19 ప్రాంతాల్లో అమెరికా సైనిక మౌలిక వసతులు ఉన్నట్లు సమాచారం. 2025 మధ్య నాటికి మధ్యప్రాచ్యంలో 40 వేల నుంచి 50 వేల మంది వరకు అమెరికా సైనికులు ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రంప్ ప్రభుత్వం ఈ బలగాలను మరింత పెంచుతూ వస్తోంది.
యుద్ధ విమానాల మోహరింపు
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభానికి ముందే అమెరికా మధ్యప్రాచ్యంలో తన వైమానిక శక్తిని భారీగా పెంచింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు, సైనిక విమానాల ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ఫిబ్రవరి ప్రారంభం నుంచి 120కి పైగా అమెరికా యుద్ధ, సహాయక విమానాలు ఈ ప్రాంతానికి చేరాయి.ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్లు, ఎఫ్-22 యుద్ధ విమానాలు, ఎఫ్-15, ఎఫ్-16 ఫైటర్లతో పాటు ఈ-3 సెంట్రీ అవాక్స్ విమానాలు కూడా మోహరించాయి. వీటికి తోడు భారీ రవాణా విమానాలు, గగనతలంలోనే ఇంధనం నింపే ట్యాంకర్లు కూడా రంగంలోకి దిగాయి.ఇది సాధారణ సైనిక బదిలీ కంటే దీర్ఘకాలిక సైనిక చర్యలకు సిద్ధమవుతున్న సంకేతంగా కొందరు సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు.
అదనంగా మరో 7 వేల మంది బలగాలు
మార్చిలోనూ అమెరికా గల్ఫ్ ప్రాంతానికి అదనపు బలగాలను పంపింది. యూఎస్‌ఎస్ ట్రిపోలీ కేంద్రంగా ట్రిపోలీ యాంఫిబియస్ రెడీ గ్రూప్, 31వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ ఒకవైపు.. యూఎస్‌ఎస్ బాక్సర్ ఆధారంగా బాక్సర్ యాంఫిబియస్ రెడీ గ్రూప్, 11వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ మరోవైపు కదిలాయి.ఈ రెండు మెరైన్ బృందాల ద్వారా సుమారు 4,500 మంది మెరైన్లు, నావికులు ఈ ప్రాంతానికి చేరారు. అదే సమయంలో అమెరికాలోని ఫోర్ట్ బ్రాగ్‌కు చెందిన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుంచి దాదాపు 2,000 మంది సైనికులతో కూడిన బలగాన్ని కూడా తరలించారు. మొత్తంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 7 వేల మంది అదనపు అమెరికా సైనికులు మధ్యప్రాచ్యానికి చేరినట్లు సమాచారం.
యుద్ధ విస్తరణకు సంకేతమా?
అమెరికా తాజా బలగాల తరలింపు యుద్ధాన్ని మరింత విస్తరించే సంకేతమా? లేక ఇరాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న వ్యూహాత్మక చర్యనా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ‘టైమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై బాంబు దాడులను మరింత పెంచే అవకాశం ఉందని సూచించారు. అయితే ఎక్కడ, ఎప్పుడు దాడులు జరుగుతాయన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో తాజా సైనిక మోహరింపును ఇరాన్‌తో చర్చల్లో అమెరికా తన బలాన్ని చూపించే వ్యూహంగా కూడా కొందరు విశ్లేషకులు చూస్తున్నారు.
హోర్ముజ్ పై ఇరాన్ ప్రతిపాదనకు నో
ఇరాన్-అమెరికా ఘర్షణలో హోర్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. ఈ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరిచేందుకు సిద్ధమని ఇరాన్ ఇటీవల ప్రతిపాదించింది. అందుకు అమెరికా కొన్ని షరతులను అంగీకరించాలని ఇరాన్ కోరింది. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, అమెరికా దాడులకు ముగింపు హామీ వంటి అంశాలను ప్రతిపాదనలో చేర్చింది.ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది. ఇరాన్ అణు కార్యక్రమంతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చ జరగాలని వాషింగ్టన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.
చర్చల ఫలితం శూన్యం
అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్షంగా కాకుండా మధ్యవర్తుల ద్వారా పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన చర్చల్లోనూ హోర్ముజ్ జలసంధి ప్రధాన అడ్డంకిగా నిలిచింది.ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించింది. హోర్ముజ్‌ను తెరవడం, అణు చర్చలను తిరిగి ప్రారంభించడం వంటి చర్యలకు బదులుగా అమెరికా నౌకాదళ దిగ్బంధం ముగింపు, ఆంక్షల సడలింపు, లెబనాన్, యెమెన్‌లలో ప్రాంతీయ కాల్పుల విరమణ వంటివి ఇరాన్ కోరింది.
కానీ ఈ ప్రతిపాదనకు ట్రంప్ నో
అమెరికా వాదన ప్రకారం.. ఇరాన్ కోరుతున్న ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల అంత తేలికైన అంశాలు కావు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. తాము యుద్ధం కోసం న్యూయార్క్‌కు రాలేదని, శాంతి కోసం ప్రయత్నించేందుకే వచ్చామని ప్రకటించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రస్తుత ఘర్షణ “త్వరలోనే ముగుస్తుంది” అని పేర్కొంటూనే.. అమెరికాతో ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఇరాన్ అమెరికాతో చేసుకునే ఒప్పందాన్ని గౌరవిస్తుందా లేదా అన్న సందేహాన్ని కూడా ట్రంప్ వ్యక్తం చేశారు. ఒకవైపు ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు.. మరోవైపు మధ్యప్రాచ్యంలో భారీగా సైనిక బలగాల మోహరింపు.. ఇంకోవైపు దౌత్య చర్చలు. ఇలా మూడు మార్గాల్లోనూ వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోంది. అయితే ఈ పరిణామాలు చివరకు చర్చల బాట పట్టిస్తాయా? లేక యుద్ధాన్ని మరింత విస్తరిస్తాయా? అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ప్రశ్న. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిష్టంభన తొలగకపోతే.. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
