అభ్యసన సామర్థ్యాల పెంపునకు 100 రోజుల కార్యాచరణ
భాషా, రాత, గణిత నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు.
బుధవారం జూలపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం, ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యాలతోపాటు రాత, గణిత సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రెమిడియేషన్ తరగతుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఏఎక్స్ఎల్ ఏఐ, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను సొంతంగా అర్థం చేసుకుని మాట్లాడేలా, తమ మాటల్లో రాసేలా ప్రోత్సహించాలన్నారు. తరగతుల వారీగా విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తూ, వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. నిర్దేశించిన 100 రోజుల లక్ష్యాలను సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
