Saturday, June 29, 2024

WGL: బొగత జలపాతానికి జలకళ…

పులకరించిన చీకుపల్లి అటవీ ప్రాంతం
అడవి తల్లి ఒడిలో అందాల సోయగం
వాజేడు, జూన్ 19(ప్రభ న్యూస్) : తెలంగాణ మినీ నయాగారా జలపాతంగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బొగత జలపాతానికి జలకళ ఉట్టిపడుతుంది. మంగళవారం రాత్రి వాజేడు మండలంతో పాటు ఛ‌త్తీస్ గ‌ఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరద నీరు అత్యధికంగా చేరడంతో బొగత జలపాతానికి జలకళ వచ్చింది. వాజేడు మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగత జలపాతం పూర్వకాలం ఉద్భవించింది.

ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ బొగత జలపాతాన్ని అటవీశాఖ అధికారులు పర్యాటకుల కోసం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ బొగత జలపాతం అందాలను తిలకించడానికి ఛ‌త్తీస్ గ‌ఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుండి పర్యాటకులు అత్యధికంగా తరలివచ్చి బొగత జలపాతం అందాలను తిలకించి ఆహ్లాదాన్ని పొందుతారు. నీరు లేక గత కొద్ది నెలలుగా వెలవెలబోయిన బొగత జలపాతం గత రాత్రి కురిసిన వర్షాలకు వరదనీరు చేరడంతో జలక‌ళ‌తో బోగత జలపాతం కళకళలాడుతుంది.

ఈ విషయం తెలుసుకున్న వాజేడు, వెంకటాపురం, ఏటూర్ నాగారం, తదితర మండలాల నుండి ప్రకృతి ప్రేమికులు బొగత జలపాతం అందాలను ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తున్నారు. నేడు ప్రారంభమైన బోగత జలపాతం జనవరి చివరి వారం వరకు నీటితో కళకళలాడుతుంది. బొగత జలపాతానికి జలకళ‌ రావడంతో చీకుపల్లి అటవీ ప్రాంతం పులకించిపోయింది. అడవి తల్లి ఒడిలో ఏర్పడిన అందాల సోయగం పర్యాటకులను ఆకట్టుకొని అబ్బురపరుస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement