Monday, May 20, 2024

Hyderabad Central University – కులం పేరిట కుట్రలు! రోహిత్ ఆత్మహత్య కేసు క్లోజ్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) నివురుగప్పిన నిప్పులా మారింది. పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు మూసివేతపై విద్యార్థి లోకం మండిపడుతోంది. ఈ కేసులో అసలు నిజాలను పక్కదోవ పట్టించే రీతిలో పోలీసులు నివేదకలను హైకోర్టుకు సమర్పించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం దేశంలో జనరల్​ ఎలక్షన్స్​ వేళ.. ఈ కేసు మళ్లీ తెరమీదకు రావటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్టు అయ్యింది. ఇప్పటికే పోలీసుల సమర్పించిన కేస్ క్లోజర్ రిపోర్టు ఆధారంగా తమపై కేసులు కొట్టివేయాలని ప్రధాన నిందితులైన ఏబీవీపీ నేతలు హైకోర్టులో పిటీషన్ వేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై పునర్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్​రెడ్డిని రోహిత్ తల్లి రాధిక కోరారు. డీజీపీతో మాట్లాడిన సీఎం.. క్లోజర్ రిపోర్టు ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసును మళ్లీ రీ ఓపెన్​ చేయాలని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం.

పోలీసులపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
కేసు పునర్​ విచారణ కోరిన తల్లి రాధిక
స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
డీజీపీ రవిగుప్తాపై సీఎం సీరియస్​
తెరమీదకు రోహిత్ వేముల చట్టం
కులం పేరిట అసలు కథ కంచికి
వర్సిటీలో కుల వివక్షపై విచారణ జరగలే
పౌరహక్కుల సంఘాల ఆరోపణ
కేసు రీ ఓపెన్​ చేసి విచారణ జరుపుతామన్న డీజీపీ

- Advertisement -

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ప్రతినిధి – హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు మూసివేతకు పోలీసుల యత్నంపై విద్యార్థి లోకం మండిపడుతోంది. ఈ కేసులో అసలు నిజాలను పక్కదోవ పట్టించే రీతిలో నివేదికలను పోలీసులు హైకోర్టుకు సమర్పించారనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం జనరల్​ ఎలక్షన్స్​ వేళ.. ఈ కేసు మళ్లీ తెరమీదకు రావటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టే. ఇప్పటికే పోలీసుల సమర్పించిన కేస్ క్లోజర్ రిపోర్టు ఆధారంగా తమపై కేసులు కొట్టివేయాలని ప్రధాన నిందితులు హైకోర్టులో పిటీషన్ వేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై పునర్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్​రెడ్డిని వేముల రోహిత్ తల్లి రాధిక శనివారం కోరారు. దీనికి సీఎం వేగంగా స్పందించారు. డీజీపీతో మాట్లాడి, క్లోజర్ రిపోర్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసును మళ్లీ రీ ఓపెన్​ చేయాలని సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం.

విద్యార్థి సంఘాల ఆగ్రహం..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్‌ వేముల మరణంపై తెలంగాణ పోలీసుల నివేదికను నిరసిస్తూ హెచ్‌సీయూ క్యాంప్‌సలో పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్సిటీలోని ఏఐవోబీసీఏ, ఏఐఎస్ఏ, ఏఎస్ఏ, బీఎస్ఎఫ్‌, డీఎస్యూ, ఫ్రెటర్నిటీ, ఎంఎసెఫ్‌, టీఎస్ఎఫ్‌, హెచ్‌సీయూ స్టూడెంట్స్‌ యూనియన్‌ విద్యార్థులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రోహిత్‌ చనిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత.. తెలంగాణ పోలీసులు నివేదికను ఏబీవీపీ, బీజేపీకి అనుకూలంగా ఇవ్వడం అన్యాయమని, ఆ నివేదిక తప్పులతడకని ధ్వజమెత్తారు. రోహిత్‌ వేములది ప్రభుత్వం చేసిన హత్యే అని విమర్శించారు. అతడి ఆత్మహత్యకు అప్పటి హెచ్‌సీయూ వీసీ అప్పారావు, బీజేపీ కీలక నేతలైన బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ వేధింపులే కారణమని కేసులు నమోదు చేసినా.. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయలేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు.

అసలు ఏం జరిగిదంటే..

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ హయాంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఏబీవీపీ ఆధిపత్య పోరాటానికి బీజం పడిన తరుణమది. డిల్లీలో సెంట్రల్ యూనివర్సీటీలో విద్యార్థి సంఘ నాయకుడు కన్షయకుమార్ ఆధ్వర్యంలో పాకిస్థాన్​కు అనుకూల నినాదాలు చేశారని ఏబీవీపీ ఆరోపించింది. ఒకవైపు ఢిల్లీ వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. సరిగ్గా ఆ తరుణంలోనే హెచ్‌సీయూలో 2015లో.. ఏబీవీపీ, అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఎస్ఏ) విద్యార్థుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో కుల రాజకీయాలకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా మారిందని నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఆ ఏడాది నవంబరులో వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సిఫారసుతో.. ఐదుగురు విద్యార్థులపై వీసీ అప్పారావు బహిష్కరణ వేటు వేశారు.

రోహిత్​ ఎలా చనిపోయాడు..

2016 జనవరి 17న రోహిత్‌ వేముల.. న్యూ రీసెర్చ్‌ స్కాలర్‌ హాస్టల్‌ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఏబీవీపీ నాయకుల వేధింపుల వల్లే రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు వీసీ అప్పారావు, ఎన్‌. రామచంద్రరావు, ఏబీవీపీ నాయకులు, తదితరులపై ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జాతీయ స్థాయిలోనే రోహిత్ ఆత్మహత్య తీవ్ర సంచలనం రేపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు.

ఆందోళనలో పాల్గొన్న రాహుల్​ గాంధీ.. రోహిత్​ వేముల చట్టానికి హామీ

హైదరాబాద్​లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ‘జస్టిస్‌ ఫర్‌ వేముల’ ఉద్యమానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని రాహుల్ వెల్లడించారు. 2022లో తెలంగాణలో నిర్వహించిన భారత్‌ జోడో యాత్రలో రోహిత్‌ తల్లి రాధిక కూడా రాహుల్​తో కలిసి నడిచారు. తాము అధికారంలోకి వస్తే.. దళితులు, ఓబీసీలు, మైనారిటీలపై అకృత్యాలను నిరోధించి, వారి విద్యాహక్కును కాపాడేలా ‘రోహిత్‌ వేముల చట్టం’ అమలుచేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విద్యార్థి సంఘాలు గుర్తుచేస్తున్నాయి.

రోహిత్ కులంతో పనేంటీ?

రోహిత్‌ ఆత్మహత్యకు, ఆయన కులానికి సంబంధం ఏమిటో అర్థం కాని రీతిలో పోలీసులు నివేదిక సమర్పించారని పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. పోలీసులు హైకోర్టుకు మార్చి 21న ఇచ్చిన ఈ కేసు క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్నారు. తన కుల ధ్రువీకరణ పత్రం సరైనది కాదనే విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భావనతో అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ఊహాత్మక అభిప్రాయాన్ని వెల్లడించారు. రోహిత్‌ ఎస్సీ కాదని.. అతడు, అతడి కుటుంబసభ్యులు బీసీ-ఏ (వడ్డెర) కులానికి చెందినవారని.. అక్రమ మార్గంలో ఎస్సీ సర్టిఫికెట్లు పొందారని.. జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ తేల్చినట్లు అందులో వెల్లడించారు.

ఎన్నికల వేళ మళ్లీ గందరగోళం..

ఈ కేసులో నిందితులు బీజేపీ, ఏబీవీపీ నేతలకు, హెచ్‌సీయూ నాటి వీసీ అప్పారావుకు అతడి ఆత్మహత్యతో సంబంధం లేదని పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఇక్కడ ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం రోహిత్ ఆత్మహత్యకు కారణాలను పోలీసులు గుర్తించలేదని తెలుస్తోంది. తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడని నివేదిక ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల వేళ .. మార్చి 21న క్లోజర్ రిపోర్టను హైకోర్టుకు ఇస్తే.. ఇప్పుడు నిందితులు తమపై కేసులు రద్దు చేయాలని పిటీషన్ వేయటం వెనుక పరమార్థం ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి దళిత వ్యతిరేకుల ఓటు బ్యాంకును పెంచుకోవటం, దళితుల్లో రోహిత్పై వ్యతిరేకత పెంచటమే ధ్యేయంగా ఈ కుట్ర జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కుల వివక్షను పట్టించుకోలేదు

కేసు దర్యాప్తులో పోలీసులు రోహిత్‌ కులం గురించి విచారణ జరిపారే గానీ.. వర్సిటీలో కుల వివక్ష గురించి పట్టించుకోలేదని విద్యార్థి సంఘలు మండి పడ్డాయి. హెచ్‌సీయూ చరిత్రలోనే తొలిసారిగా వర్సిటీలోని దళిత విద్యార్థులను వెలివేశారని, నాటి వీసీ పొదిలి అప్పారావు అగ్రవర్ణాలకు వంతపాడుతూ 10 మంది దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. అప్పారావు 2001 నుంచి దళిత విద్యార్థులు, దళిత ప్రొఫెసర్లపై వివక్ష చూపేవారని, ఈ అవమానం భరించలేక రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు తెలిపారు. పోలీసులు రోహిత్‌ దళితుడా కాదా అన్న అంశంపైనే దృష్టిపెట్టారని.. ఆధారాలు లేకుండా రోహిత్‌ దళితుడు కాదని చెబుతూ ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను తొలగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్‌ వేముల కేసు దర్యాప్తులో పోలీసులు రూపొందించిన 60 పేజీల రిపోర్టులో 40 పేజీలు అతడు దళితుడు కాదని నిరూపించేందుకే కేటాయించారని.. ఏబీవీపీ, బీజేపీ ప్రచారం చేసిన విధంగానే అతడు దళితుడు కాదని రిపోర్టు ఇచ్చారని దుయ్యబట్టారు.

రోహిత్ ఆత్మహత్యపై పునర్విచారణ జరుపుతాం: డీజీపీ రవిగుప్తా

రోహిత్‌ మృతి కేసుపై పునర్విచారణ జరపనున్నట్టు డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఈ కేసు తుది నివేదికను.. 2023 నవంబరు ముందు నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా రూపొందించి, మార్చి 21న కోర్టుకు సమర్పించినట్టు ఆయన వెల్లడించారు. అయితే.. దీనిపై రోహిత్‌ వేముల తల్లితోపాటు, మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తదుపరి దర్యాప్తునకు అనుమతి కోరుతూ త్వరలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement