Wednesday, July 3, 2024

Andhra Prabha Effect – అయ్యప్ప సొసైటీ అక్రమాలపై కన్నెర్ర … నేటి నుంచి కూల్చివేతలు షురూ….


అక్రమ భవంతులపై ఉక్కుపాదం మోపిన అధికారులు
అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సర్వత్రా ఆందోళన
ఆంధ్రప్రభ కథనాలతో కదిలిన అధికార యంత్రాంగం

- Advertisement -

ఆంధ్రప్రభ నిఘా విభాగం, గ్రేటర్ హైదరాబాద్ – హైదరాబాద్ నగరానికి గుండెకాయలాంటి హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో సాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రభ వరుస కథనాలను ప్రచురించింది. ఎటువంటి అనుమతులు లేకుండా పేకమేడల్లాంటి నిర్మాణాలతో ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న విషయమై ఆంధ్రప్రభ ప్రముఖంగా ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఆదేశించడంతో ఇంతకాలం మౌనమునులుగా వ్యవహరించిన అవినీతి అధికారులు సైతం స్పందించాల్సి వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం అధికారులు కదిలొచ్చారు.

తూతూమంత్రపు కూల్చివేతలు

శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ -21 సర్కిల్ ఏసీపీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం కూల్చివేతలను చేపట్టగా, అవినీతి అధికారులు ప్రజల సమక్షంలోనే పేపర్లలో రావడం సాధారణమని, ఒకటి రెండు కూల్చితే, మాకు ముట్టాల్సినవి ముడతాయంటూ నర్మగర్భంగా పేర్కొనడం గమనార్హం. దీంతో అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలకు దిగితే తప్ప, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడదన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

జోనల్ కమిషనర్ ఆదేశాలు భేఖాతర్

అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రభ కథనాలతో స్పందించిన జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుండగా, కాసుల కక్కుర్తితో అక్రమ నిర్మాణదారులతో అంటకాగిన అవినీతి అధికారులు జడ్సీ ఆదేశాలను సైతం భేఖాతర్ చేసినట్లు కనిపిస్తోంది. కేవలం మొక్కుబడిగా కూల్చివేతలు చేపట్టడంతో పాటు, ఆయా బిల్డింగ్ లకు కేవలం రంద్రాలు వేసి, వదిలేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అవినీతి అధికారులపై విచారణ జరపడంతో పాటు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement