Friday, June 28, 2024

Andhra Pradesh – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టాలీవుడ్ బృందం భేటి ….

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి ) – విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి, సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చ ప్రారంభమైంది. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కు నివేదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సమావేశంలో నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, శ్రీ నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశం ఉల్లాసంగా సాగిందని వెల్లడించారు. 

“ఈ రోజు మా అందరికీ సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కల్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాం. ఈ సమావేశంలో మేం కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా… సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను అభినందించడానికి ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించమని అడిగాం. సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ లభిస్తే… ఇండస్ట్రీలో వివిధ విభాగాల వాళ్లందరం తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను అభినందిస్తాం. తప్పకుండా సీఎం అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. నేడు పవన్ తో సమావేశం చాలా సంతోషకరమైన వాతావరణంలో సాగింది” అని అల్లు అరవింద్ తెలిపారు. 

ఇది కాక ఇతర విషయాలేమైనా చర్చించారా? అన్న ప్రశ్నకు ఆల్లు అరవింద్ ఆసక్తికరంగా బదులిచ్చారు. ఇండస్ట్రీ సమస్యల గురించి ఈ సమావేశంలో ఎలాంటి ప్రస్తావన రాలేదని, టికెట్ ధరల పెంపు అనేది చాలా చిన్న విషయం అని వ్యాఖ్యానించారు.  చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో మాట్లాడుకున్నప్పటికీ, ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్ర పరిశ్రమ ప్రతినిధుల బృందం కలిసినప్పుడు అన్ని విషయాలు చెబుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement