Tuesday, June 25, 2024

Andhra Pradesh – నరకానికి కేరాఫ్ అడ్రస్ విశాఖ కేజీహెచ్ …..

(ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్నం ప్రతినిధి)
విశాఖపట్నంలోని ప్రఖ్యాత కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఓ హృదయ విదారక ఘటన కలచివేసింది. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఈ సర్కారు దవాఖానాలో డాక్టర్లు, సిబ్బంది తమ విధి నిర్వహణలో అలసత్వ ప్రదర్శనకు ఈ ఘటనే సాక్ష్యం. నెలలు నిండకుండా భూమ్మీద పడిన ఓ పసిగుడ్డును కాపాడలనే కనీస మానవత్వం ఈ ఆసుపత్రి సిబ్బందిలో కనిపించలేదు. ఊపిరి అందక ప్రాణం కోసం కొట్టి మిట్టాడుతున్న ఈ పసిగుడ్డును మెటర్నిటీ వార్డు నుంచి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి ఏ ఒక్కరూ స్పందించలేదు. వార్డు బాయ్ లు కదలలేదు. కనీసం వార్డులో పని చేసే ఏ ఎన్ ఎంలూ కనిపించలేదు. తన బిడ్డ ప్రాణాలు నిలపటానికి ఆ తండ్రి పడిన వేదన వర్ణనాతీతం. కన్నీళ్లతో వేడుకున్నాడు. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి ఆక్సిజన్ సిలండర్ ను తాను మోస్తానని ,,, సిలిండర్ ను భుజానికి ఎత్తుకున్నాడు. ఈ దయనీయ ఘటనపై ఓ నర్స్ ముందుకు వచ్చి పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుని ముందుకు నడుస్తుంటే.. ఆ తండ్రి ఆక్సిజన్ సిలిండర్‌తో కదిలాడు.

అసలేం జరిగింది ?

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు విష్ణుమూర్తి భార్య అల్లు శిరీష‌కు మంగళవారం ప్రసవ నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో చేర్పించి వైద్యం అందించారు. నెలలు నిండకుండని ఓ బిడ్డకు శిరీష జన్మనిచ్చింది. దీంతో శిశువును ఎన్‌ఐసీయూలో ఉంచాలని వైద్యులు సిబ్బందికి సూచించారు. పసికందుకు ఆక్సిజన్‌ పెట్టి ఎన్‌ఐసీయూకు బయలుదేరారు. బిడ్డను పట్టుకొని నర్సు ముందు నడుస్తుండగా అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్‌ సిలిండర్‌ను భుజాన వేసుకొని ఆమె వెనక నడిచారు. ఈ ఉదంతాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విషయం కాస్తా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానందకు చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని వైద్యులు, సిబ్బందిని పిలిచి హెచ్చరించారు. రోగుల సౌకర్యం కోసం బ్యాటరీ వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

వెంటిలేటర్ బ్యాటరీ మటాష్

విశాఖ కేజీహెచ్‌లో రెండు రోజుల కిందటే సోమవారం అర్ధరాత్రి ఓ ప్రమాదం జరిగింది. కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్‌ బ్యాటరీ పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని రోగులు, పిల్లలను మరో వార్డుకు తరలించారు. వెంటిలేటర్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చే సరికి మంటలు అదుపులోకి వచ్చాయి. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానందకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ముగ్గురు డాక్టర్లు విచారణ

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్‌ శివానంద ముగ్గురు వైద్యులతో విచారణ కమిటీ వేశారు. అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ వి.రవి, ఏఆర్‌ఎంవో డాక్టర్‌ దవళ భాస్కరరావు, బయోమెడికల్‌ ఇంజినీర్‌ రాజేష్‌తో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బృందం ప్రమాదంపై విచారణ జరిపి షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ప్రమాదం తీరుపై సూపరింటెండెంట్‌కు నివేదిక సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement